: భారతీయ పర్యాటకులకు షాకిచ్చిన హాంకాంగ్!
భారతీయ పర్యాటకులకు హాంకాంగ్ ఊహించని షాక్ ఇచ్చింది. మన వాళ్లకు ఇప్పటి దాకా ఉన్న వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని హాంకాంగ్ రద్దు చేసింది. హాంకాంగ్ కు రావడానికి ముందే... ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ కోసం భారతీయులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అయితే, దౌత్యవేత్తలు, అధికారిక పాస్ పోర్టులు కలిగిన వారికి మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది. కొంత మంది భారతీయులు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హాకాంగ్ ఈ సందర్భంగా ఆరోపించింది. ఈ కారణంగానే ఈ సదుపాయాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
మరోవైపు థాయ్ లాండ్ మాత్రం మూడు నెలల పాటు వీసా ఫీజులను సగానికి తగ్గించింది. 2017 ఫిబ్రవరి 28 వరకు టూరిస్ట్ వీసా మీద వచ్చే భారతీయులకు... వీసా ఆన్ అరైవల్ ఫీజును 2000 థాయ్ బాత్ ల నుంచి 1000 థాయ్ బాత్ లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఒక థాయ్ బాత్ విలువ మన కరెన్సీలో రూ. 1.90కి సమానం. దీంతో, మనం రూ. 2వేలు చెల్లిస్తే సరిపోతుంది. థాయ్ లాండ్ కు వెళ్లడానికి ముందే వీసా తీసుకుంటే కేవలం రూ. 335 చెల్లిస్తే చాలు.