: ఎన్నికల కోడ్ రాకముందే... 4 గంటల్లో 300 శంకుస్థాపనలు చేసేసిన అఖిలేష్ యాదవ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఏ నిమిషమైనా రావచ్చన్న వార్తల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ రాకముందే పనులన్నీ చక్కబెట్టుకునే దిశగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరుగులు పెట్టారు. ఒకటీ రెండూ కాదు... ఏకంగా 300 శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నాలుగంటే నాలుగు గంటల్లో కానిచ్చేశారు. దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో భాగంగా ఓ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ, క్యాన్సర్ హాస్పిటల్, ఓలింపిక్స్ సైజున్న స్విమ్మింగ్ పూల్ తదితరాలకు శంకుస్థాపన చేశారు.
రూ. 850 కోట్ల విలువైన అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం పలికారు. ఈ ప్రాజెక్టుల్లో లక్నో - ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే కూడా ఉంది. లక్నో మెట్రో తొలి దశ ట్రయల్ రన్ ను అఖిలేష్ లాంఛనంగా మొదలు పెట్టారు. ఆపై ఆయన ప్రసంగిస్తూ, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దుతో యూపీలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. డబ్బుల్లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, పలువురి ప్రాణాలు పోయాయని ఆరోపించారు.