: అలాంటి భారత దేశంలో క్యాష్ లెస్ ఎకానమీ ఎలా సాధ్యమవుతుందో చెప్పాలి!: పవన్ కల్యాణ్


ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ డీమోనిటైజేషన్ పై స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా పెద్ద నోట్ల రద్దు అంశంపైన రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిట్ పటేల్ ను టార్గెట్ చేస్తూ, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో బాలరాజు వంటి ఎందరో వ్యక్తులు బ్యాంకుల ముందు క్యూలైన్ లో నిలబడి మరణించడానికి ఉర్జిత్ పటేల్ అద్భుతమైన మేధోమథనం నుంచి ఉద్భవించిన డీమోనిటైజేషన్ కారణమని విమర్శించారు. 69 ఏళ్ల స్వతంత్ర భారతంలో మానవత్వానికి మచ్చగా నిలిచే మాన్యువల్ స్కేవెంజింగ్ (మలవిసర్జనను తీసుకుపోయే పధ్ధతి) ను ఇంకా రూపుమాపలేకపోయామని, అలాంటి భారత దేశంలో క్యాష్ లెస్ ఎకానమీ ఎలా సాధ్యమవుతుందో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

'మీరు అనాలోచితంగా సూచించిన ఈ నిర్ణయం వల్ల దేశంలోని ఎన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారో తెలుసా?' అని ఆయన అడిగారు. దుర్మార్గులు, దేశాన్ని నాశనం చేసిన వారంతా ఇంట్లో కూర్చుని డబ్బులు మార్చుకుంటుంటే... నిరుపేదలు, నిస్సహాయులు, దేశ ప్రజలు మాత్రం క్యూలైన్లలో నిల్చున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నల్లధనాన్ని రద్దు చేసేశామని, దేశాన్ని అవినీతి రహితంగా మార్చేశామని చంకలు గుద్దుకుని ఎగరవచ్చని ఎద్దేవా చేసిన ఆయన, 'వాస్తవం ఏంటంటే, మీరు పాతవాటిని కొత్తగా మార్చారు' అంటూ పవన్ తీవ్రంగా విమర్శించారు.

  • Loading...

More Telugu News