: ద్రావిడ్ పై ప్రశంసల జల్లు కురిపించిన బీసీసీఐ అధ్యక్షుడు
భారత క్రికెట్ దిగ్గజం, అండర్-19 కోచ్ రాహుల్ ద్రావిడ్ పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన యువ క్రికెటర్ కరుణ్ నాయర్ ప్రతిభను ప్రత్యేకంగా అభినందించిన అనురాగ్... ద్రావిడ్ ను ఆకాశానికి ఎత్తేశారు. కరుణ్ నాయర్ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ద్రావిడ్ కృషి ఉందని ఆయన చెప్పారు.
యువ క్రికెటర్లకు ఎన్నో టెక్నిక్ లను ద్రావిడ్ నేర్పుతున్నాడని... ఇది యువ క్రికెటర్లకు వరంలా మారిందని కొనియాడారు. ద్రావిడ్ పర్యవేక్షణలో కుర్రాళ్లు రాటుదేలుతున్నారని అన్నారు. మరోవైపు, కరుణ్ నాయర్ ఆటతీరును అనురాగ్ ప్రశంసించారు. పాతికేళ్ల వయసుకే టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీని సాధించడమంటే ఆషామాషీ విషయం కాదని ఆయన చెప్పారు. నాయర్ అసాధారణ ప్రదర్శనను ప్రశంసిస్తున్నానని తెలిపారు.