: చివరి పరీక్షలో కూడా ట్రంప్ దే విజయం... 'వీ డిడ్ ఇట్' అంటూ ట్రంప్ ట్వీట్
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే క్రమంలో చివరి పరీక్షలో కూడా ట్రంప్ ఘన విజయం సాధించారు. అత్యంత కీలకమైన ఎలక్టోరల్ కాలేజ్ కూడా ట్రంప్ నే అధ్యక్షుడిగా ఎన్నుకుంది. దీంతో, అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఖరారయ్యారు. ట్రంప్ ను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినప్పటికీ... వారు సఫలీకృతులు కాలేకపోయారు. తన విజయం పట్ల ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'వీ డిడ్ ఇట్' అంటూ ట్వీట్ చేశారు. ఈ అడుగుతో, ఇకపై మనం మరింత అభివృద్ధి దిశలో నడుద్దామని, దేశాన్ని సమైక్యం చేసే దిశగా సాగుదామని తెలిపారు. మరోవైపు, ట్రంప్ ను అడ్డుకోవడానికి మీడియా ఎన్ని అసత్యాలు రాసినా, డెమోక్రాట్లు ఎన్ని కుయుక్తులు పన్నినా... ఆయన మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించారని ట్రంప్ వర్గం ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 8న పోలింగ్ జరిగింది. కేవలం 24 గంటల్లోపే ఎన్నికల ఫలితం వెలువడింది. కానీ, అమెరికా రాజ్యాంగం ప్రకారం సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత... వాషింగ్టన్ డీసీ నుంచి ఎన్నికైన 538 మంది ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టర్లు... తమతమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశమై, దేశాధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో, తుది పరీక్షలో సైతం ట్రంప్ ఘన విజయం సాధించారు. జనవరిలో అగ్ర రాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ పదవీబాధ్యతలను స్వీకరించనున్నారు.