: శ్మశానంలో రూ.20 లక్షలు.. వదిలేసి పరారైన డ్రైవర్
ఏటీఎంలో పెట్టాల్సిన డబ్బులున్న వాహనంతో పరారైన డ్రైవర్ దానిని శ్మశానంలో వదిలేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సిటీ పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన సెబన్ హుస్సేన్ మడివాళలోని సెక్యూర్ వాల్యూ ఇండియా సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం హుస్సేన్ రూ.20 లక్షల నగదుతో వాహనం తీసుకుని పరారయ్యాడు. తర్వాత ఏమైందో కానీ వాహనాన్ని యమళూరు చెరువు వద్ద, డబ్బు ఉన్న ట్రంకు పెట్టెను బెళ్లండూరు సర్కిల్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో వదిలేసి పరారయ్యాడు.
హుస్సేన్ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు శ్మశానం వద్ద పెట్టెను కనుగొన్నారు. దానిని తెరిచి చూసిన అధికారులు అందులోని రూ.20 లక్షలు అలాగే ఉన్నట్టు గుర్తించారు. ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును దొంగిలించడానికి హుస్సేన్ ప్రయత్నించాడని, అయితే పట్టుబడతాననే భయంతోనే డబ్బును వదిలేసి పారిపోయి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఉద్యోగంలో చేరిన సమయంలో నిందితుడు ఇచ్చిన కోరమంగళలోని అడ్రస్‌కు వెళ్లగా అక్కడ కనిపించకపోవడంతో సొంత రాష్ట్రం వెళ్లి ఉంటాడని భావించిన పోలీసుల బృందం అతడి సొంత రాష్ట్రమైన అసోం బయలుదేరింది.