: నయీమ్ కేసులో సీబీఐ మాటే వద్దు... ఆ ప్రసక్తే లేదు: కుండబద్దలు కొట్టిన కేసీఆర్
నయీమ్ ఎన్ కౌంటర్ కేసును సీబీఐ విచారణకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఎన్ కౌంటర్ పై అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆయన సమాధానం చెబుతూ, నయీమ్ దందాలు పెరగడం వెనుక ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ అత్యంత సమర్థవంతమైనదని, ఎటువంటి కేసునైనా విచారించే సత్తా ఉందని, దోషులను వదిలిపెట్టరని చెబుతూ, సీబీఐకి కేసును అప్పగించి రాష్ట్ర పోలీసుల సత్తాను తక్కువ చేయబోమని అన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ అర్థరహితమని, ఆ ప్రసక్తే తేవద్దని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 చార్జ్ షీట్లు దాఖలు చేశామని గుర్తు చేసిన ఆయన, నయీమ్ తో అంటకాగిన నేతలు ఎవరైనా చట్టం ముందు నిలబడతారని అన్నారు. ఎవరినీ ఉపేక్షించబోమని, టీఆర్ఎస్ సహా ఏ పార్టీలో ఉన్న నేతకైనా, నయీమ్ తో సంబంధాలున్నాయని తేలితే వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.