eet: మీరా, మమ్మల్ని విమర్శించేది?: అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలపై మంత్రి ఈటల ఆగ్రహం
తెలంగాణ శాసనసభలో బడ్జెట్ లెక్కలపై చర్చ కొనసాగుతోంది. తెలంగాణ బడ్జెట్ లక్షకోట్ల రూపాయలకు మించదని ఆనాడే చెప్పానని, రూ.51,615 వేల కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు పెట్టారని కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి విమర్శించారు. ఇప్పుడు 30 నుంచి 35 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ వచ్చే ప్రమాదం ఉందని, అది ఎలా భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు ప్రభావం కూడా ఆదాయంలో ప్రభావం చూపుతుందని అన్నారు. జానారెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలా తమని విమర్శించేదని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతలు తమా గురించే ఆలోచించుకున్నారే తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించుకోలేదని ఈటల రాజేందర్ అన్నారు. తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జానారెడ్డి ఎన్నో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.51,615 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. మామూలుగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఓసారి చరిత్రలో ఈ మాసాల్లో జరిగిన ఖర్చును పరిశీలించి మాట్లాడాలని అన్నారు. లక్షకోట్ల బడ్జెట్ దాటుతుందని చెప్పారు. నోట్ల రద్దు వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడిన విషయం నిజమేనని అన్నారు. రెవెన్యూ రాబడి ఒక్కోసారి తగ్గుతుందని, ఒక్కోసారి పెరుగుతుందని చెప్పారు. గతంలో కంటె ఈ సారి రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పారు.