: నల్లధనాన్ని వ్యభిచారంతో పోలుస్తూ... నివారణకు మార్గాలు చెప్పిన నోబెల్ గ్రహీత
హాల్మ్ స్టార్మ్, ఓలివర్ హార్ట్... ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాదికి గాను నోబెల్ పురస్కార గ్రహీతలు. గత బుధవారం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వద్ద కొంత మంది పాత్రికేయులతో వీరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన ఓ జాతీయ మీడియా సంస్థ వారి ముందు నోట్ల రద్దు అంశాన్ని ఉంచింది. నల్లధనంపై పోరులో భాగంగా భారత సర్కారు పెద్ద నోట్లను రద్దు చేయడం... నిజానికి ఫలితాన్నిస్తుందా? అని ప్రశ్నించింది. దీనిపై హాల్మ్ స్టార్మ్ ఏ విధంగా చెప్పారో చూద్దాం...
‘అత్యధికులైన ఆర్థికవేత్తలు నల్లధనం ఎక్కువగా పోగేసిన వారి పని పట్టేందుకు ఓ చర్యగా దీన్ని భావించవచ్చు. కానీ, ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఒకటుంది. అటువంటి నేరగాళ్లు ఎక్కడికి వెళతారు, దేని కోసం ఆ నల్లధనాన్ని వినియోగిస్తారు? నోట్ల రద్దుతో ప్రభుత్వం చేదు ఫలితాలనే చవిచూస్తుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని నేను చెప్పడం లేదు. ప్రజలు మాత్రం ఇలానే ఆలోచిస్తారు. కనుక ఇది వ్యభిచారంపై చర్చలాంటిదే. నేరరహితం చేస్తే అది అధికారికం అవుతుంది. వ్యభిచారం చేసే కార్మికులకు రక్షణ దొరుకుతుంది. అలాగే, నల్లధనాన్ని అరికట్టాలని భావిస్తే నల్లధనం పోగేసుకోవడానికి దారితీసే అంశాలను చట్టబద్ధం చేయాలి. కానీ, వీటిని చట్టవిరుద్ధం చేస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు అవసరం’ అని హాల్మ్ స్టార్మ్ వివరించారు.