: చైనాకు ట్రంప్ షాకింగ్ ట్వీట్... ఆ డ్రోన్ అవసరం లేదని స్పష్టీకరణ
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోయే డోనాల్డ్ ట్రంప్ చైనాకు షాక్ ఇచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా బలగాలు పట్టుకున్న అమెరికా నేవీకి చెందిన మానవరహిత గ్లైడర్ తమకు అవసరం లేదని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఈ గ్లైడర్ ను చైనా గురువారం స్వాధీనం చేసుకుంది. దీన్ని వెనక్కిచ్చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలాల్లో సంచరిస్తున్న దాన్ని పట్టుకోవడం చట్టవిరుద్దంగా పేర్కొంది.
అయితే, ఇది తమ దేశం పరిధిలోని జలాల్లోకి ప్రవేశించిందని... ఓడలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా దీన్ని తాము స్వాధీనం చేసుకున్నామని, దాన్ని తిరిగి ఇచ్చేస్తామని చైనా ప్రకటించింది. అంతర్జాతీయ నిబంధనల మేరకే అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహంతో ట్వీట్ చేశారు. ‘వారు దొంగిలించిన డ్రోన్ మాకు అవసరం లేదు. వారినే ఉంచుకోనివ్వండి’ అంటూ ట్రంప్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు.