: మోదీ ఎంతో ధైర్యంతో సాహసం చేశారు.. మనం స్వాగతించాలి!: శాసన మండలిలో సీఎం కేసీఆర్
పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై తెలంగాణ శాసన మండలిలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ కూడా పెద్దనోట్లు రద్దు చేయాలని భావించిందని కానీ, చేయలేకపోయిదని, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ సాహసం చేశారని అన్నారు. పెద్దనోట్ల రద్దు అసాధారణ నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని మనం స్వాగతించాలని కోరారు. ఆ నిర్ణయం పూర్తిగా తప్పు అని అనలేం, కష్టాలు లేవని చెప్పలేం అని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు తరువాత వచ్చిన సమస్యల గురించి అందరికీ తెలుసని అన్నారు.
ప్రధాని మోదీ ఇక్కడితో ఆగబోరని, నల్లధనం ఏ రూపంలో ఉన్నా బయటకు రావాల్సిందేనని, ఈ విషయంలో మోదీ మరిన్ని చర్యలు తీసుకుంటారని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి 50 రోజుల సమయం ఇవ్వమని ప్రధానమంత్రే చెప్పారని, ఇంకా 50 రోజులు కాలేదని, వేచి చూద్దామని కేసీఆర్ అన్నారు. సిద్ధిపేటను నగదురహిత ప్రాంతంగా మారుస్తున్నామని చెప్పారు. 100 శాతం క్యాష్‌లెస్ అంటే అది సాధ్యం కాదని, సాధ్యమైనంత వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరపాలని అన్నారు. కాష్‌లెస్ అంటే పూర్తిగా డబ్బు లేకుండా చేయడం కాదని, ఎంత వరకు అవసరమో అంతవరకు వినియోగంలో ఉంటాయని చెప్పారు.