: 19వ తేదీన అమెరికా అధ్యక్షుడికి అసలైన పరీక్ష!
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఎన్నికయ్యారు. కానీ, ఈ నెల 19న అసలైన పరీక్ష ఉంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఇంకా ముగియలేదు. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి ఎన్నికైన 538 మంది ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు ఈ నెల 19న తమ రాష్ట్ర రాజధానుల్లో భేటీ అయి, అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకుంటారు. ఈ 538 ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లలో 306 మంది రిపబ్లికన్లు ఉండగా... 232 మంది డెమోక్రాట్లు ఉన్నారు. మెజారిటీకి అవసరమైన కనీస ఓట్లు 270. ఇరు పక్షాల ఎలక్టర్లు ఎవరి అభ్యర్థికి వారు ఓటు వేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.
అయితే, రిపబ్లికన్లలో ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉండటంతో... కొంతమేర ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ కు ఓటేయనంటూ టెక్సాస్ రిపబ్లికన్ ఎలక్టర్ క్రిస్టఫర్ ఇప్పటికే ప్రకటించడం సంచలనంగా మారింది.