: జయలలిత తన వెంట ఏం తీసుకెళ్లారు? ఆమె పదివేల చీరలు ఎక్కడికి పోయాయి?.. మంత్రి ఈటల
జయలలిత తన వెంట ఏం తీసుకెళ్లారు? ఆమె పదివేల చీరలు ఎక్కడికి పోయాయి?.. అంటూ తెలంగాణ మంత్రి ఈటల రాజేంద్ర అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మనీ, మానవ విలువల గురించి మాట్లాడుతుండగా విషయం ఒక్కసారిగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి వైపు వెళ్లింది. ఇటీవల తాను ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పిన మంత్రి.. తాను మాట్లాడడం పూర్తిచేసిన తర్వాత అందరూ ఆహా, ఓహో అన్నారని అన్నారు.
మనం పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకువెళ్లలేమని, జయలలిత తన వెంట ఏం తీసుకెళ్లారని, ఆమె పది వేల చీరలు ఏమై పోయాయని ఆయన ప్రశ్నించారు. తాను దేవుడిని నమ్మనని పేర్కొన్న మంత్రి, తనకు దేవుడిపై విశ్వాసం లేకున్నా రూ.5 కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. పాత కరీంనగర్ జిల్లాలో రూ.15 కోట్లతో పాఠశాలలో మౌలిక వసతులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. సామూహిక వివాహాలు కూడా చేయిస్తున్నానన్నారు. ‘‘మనం చనిపోయినప్పుడు..పోతే పోయిండులే అని అనుకోకుండా, అయ్యో.. అని అనిపించుకోవాలి’’ అని మంత్రి పేర్కొన్నారు.