: బ్లాక్ మనీ ఉంటే మార్చి ఇస్తామని మా వాళ్లే నన్ను అడిగారు.. ఆర్థిక మంత్రి ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడిన మంత్రి తానెక్కడ మాట్లాడినా మానవ విలువలు, మానవత్వం గురించే మాట్లాడతానని చెప్పుకొచ్చారు. అటువంటి సమయంలో తాను ఒక మంత్రిననే విషయాన్ని కూడా మర్చిపోతానని అన్నారు. ఇటీవల పెద్ద నోట్ల రద్దు తర్వాత కొందరు తనకు ఫోన్ చేశారని, తన దగ్గర నల్ల డబ్బు ఉంటే మార్చి ఇస్తామన్నారని పేర్కొన్నారు. అయితే 'మీ దగ్గరే ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి.. అప్పులు తీర్చుకుంటా'నని వారితో అన్నానని నవ్వుతూ చెప్పారు. ఈ సందర్భంగా మానవ విలువలపై విలేకరులకు అవగాహన కార్యక్రమం కూడా పెడతానని మంత్రి పేర్కొనడం గమనార్హం.