: పెద్దనోట్లను రద్దు చేయమని చంద్రబాబు నాయుడు చెప్పారు.. ఆ మాటకి కట్టుబడే ఉన్నాం: రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని కేసీఆర్ చెబుతున్నారని, అందుకోసం రాష్ట్రంలో 10 లక్షల స్వైపింగ్ మిషన్లు అవసరమవుతాయని, అయితే, 78 వేల స్వైపింగ్ మిషన్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. స్వైపింగ్ మిషన్ల ధర ధర పదివేల వరకు ఉంటుందని, అంత డబ్బు పెట్టి కూరగాయలు అమ్మేవారు, చిరువ్యాపారులు స్వైపింగ్ మిషన్లు కొనుక్కోలేరు కదా? అని ప్రశ్నించారు. నగదురహిత లావాదేవీలంటూ ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని అన్నారు.
ఇంటర్నెట్, స్వైపింగ్ మిషన్లు లేకుండా నగదురహిత లావాదేవీలు ఎలా జరుగుతాయని రేవంత్ రెడ్డి అడిగారు. కావలసిన సౌకర్యాలు కల్పించకుండా నగదురహిత లావాదేవీలు జరగాలని అంటున్నారని అన్నారు. ఇంతలో కల్పించుకున్న ఇతర సభ్యులు.. పెద్దనోట్లను రద్దు చేయమని చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన మాటకి తాము ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని అన్నారు. కానీ, ఆ ఆలోచన మంచిదైనా ఆచరణలో కష్టాలు వస్తున్నాయని తాను చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు సమస్య మీద చర్చించడానికి ఇస్తున్న ప్రాధాన్యత సమస్యను తీర్చడంలో ఇవ్వడం లేదని అన్నారు. సమస్యలను సునిశితంగా పరిశీలించి ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.