: నకిలీ అకౌంట్లతో మా పరువు పోతోంది: యాక్సిస్ బ్యాంకు గగ్గోలు
పెద్ద నోట్ల రద్దు అనంతరం తమ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వచ్చిపడడంతో తమ బ్యాంకు పరువు పోయిందని యాక్సిస్ బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ అనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఒక్కసారిగా భారీ ఎత్తున పెద్దమొత్తంలో జమకావడంతో, ఐటీ అధికారుల దాడుల్లో భారీ ఎత్తున నకిలీ అకౌంట్లు వెలుగు చూడడంతో యాక్సిస్ బ్యాంకు ప్రతిష్ఠ మసకబారిందని అన్నారు.
ఈ పరిణామం తమను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని ఆయన బాధపడ్డారు. ఒకసారి బ్రాండ్ నేమ్ పాడైపోతే మళ్లీ దానిని సాధించడానికి తీవ్రమైన కృషి చేయాలని, అలా మాత్రమే మళ్లీ వినియోగదారుల నమ్మకాన్ని పొందగలమని ఆయన చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లోని పలు యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లోని నకిలీ అకౌంట్లలో భారీ ఎత్తున జమ అయిన డబ్బును ఐటీ శాఖ అధికారులు వెలికితీస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుకానుందంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. కాగా, తమ లైసెన్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని యాక్సిస్ బ్యాంక్ తో పాటు, ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది.