pawan: మరోసారి బీజేపీని నిలదీసిన పవన్ కల్యాణ్... బీజేపీ ముందు ఐదు ప్రశ్నలు!
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మరోసారి భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు ట్విట్టర్‌లో ఆయన బీజేపీ ముందు ఐదు ప్రశ్నలు ఉంచారు. తాను గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే సపోర్ట్ చేయలేదని, కర్ణాటకలో కూడా వారి తరఫున ప్రచారం చేశానని గుర్తుచేసిన పవన్.. తాను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అన్నారు. గోవధ, వేముల రోహిత్ ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాలను కేంద్ర సర్కారు ముందు ఉంచుతున్నానని అన్నారు.
గోవధ నిషేధంపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిషేధం విధించవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఈ అంశం నిజాయతీగా ఉంటే లెదర్ తో తయారు చేసిన పాదరక్షలు, బెల్టులను వాడకూడదని తమ కార్యకర్తలకు సూచించాలని అన్నారు. గోవులను రక్షించాలని అనుకుంటూ ప్రతి బీజేపీ కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు. ఇక రోహిత్ వేముల ఆత్మహత్యపై రేపు ప్రశ్నలు అడుగుతానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.