: మగపిల్లాడిని కనలేదంటూ భార్యను వేధిస్తున్న న్యాయవాది... తండ్రిని పట్టించిన కూతురు !
బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి తనకు కొడుకు పుట్టలేదనే బాధతో భార్యను వేధిస్తున్న సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించి సదరు వ్యక్తి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి పెట్టే బాధలు భరించలేకపోయిన ఒక కూతురు తెలివిగా ఒక పని చేసింది. వారిపై తండ్రి దురుసుగా ప్రవర్తిస్తున్న సమయంలో వీడియో తీసి, ఆ వీడియోను పోలీసులకు పంపింది. ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోలో సదరు న్యాయవాది తన భార్యను, కూతురును దూషించడమే కాకుండా, వారిని తోసివేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
ఈ సందర్భంగా పోలీసులకు అతని భార్య వివరాలు తెలిపింది. ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తన భర్త తనను, తన పిల్లలను కొడుతుంటాడని చెప్పింది. మగపిల్లాడిని కనలేదంటూ తనను హింసిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాము దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో నివసిస్తున్నామని, ఇక్కడి ఒక ప్రైవేట్ పాఠశాలలో తమ ఇద్దరి కుమార్తెలు చదువుకుంటున్నారని ఆ ఇల్లాలు పేర్కొంది. అయితే, ఆ న్యాయవాది పేరు ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది.