: ‘నలుపే నలుపు’.. దాడులతో బెంబేలెత్తించిన ఐటీ.. ఒక్క రోజులోనే రూ.20 కోట్లు స్వాధీనం
ఒక్క రోజుల్లో రూ.20 కోట్లు.. ఐటీ అధికారుల దాడుల్లో దొరికిన నల్లడబ్బు ఇది. బుధవారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ‘నల్లబాబుల’ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. పూణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని పలు లాకర్లలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదులో రూ.2 వేల నోట్లు భారీగా ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు సోదా చేసిన లాకర్లన్నీ ఓ ప్రైవేటు కంపెనీకి చెందినవి. ఈ కంపెనీకి మొత్తం పది లాకర్లు ఉండగా అధికారులు ఇప్పటి వరకు ఐదు లాకర్లు తెరిచారు.
మరో ఘటనలో ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉన్న ఓ హోటల్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.3.25 కోట్లు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయాల్లోని స్కానింగ్ యంత్రాలు కూడా గుర్తించలేనంతగా డబ్బును ప్యాక్ చేయడాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. చండీగఢ్‌లో ఓ వస్త్రవ్యాపారి ఇందర్‌పాల్ మహాజన్ ఇంటిపై దాడి చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రూ.2.20 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో ఓ వ్యాపారి ఇంటిపై నిర్వహించిన దాడుల్లో రూ.13.93 లక్షల అక్రమ సొమ్ము వెలుగుచూసింది. ఇక రాజస్థాన్‌లో జైపూర్‌లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.5.68 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పూణెలోని ఓ కారు నుంచి రూ.67 లక్షలు, గురుగ్రామ్‌లో మరో కారు నుంచి రూ.9.5 లక్షలు, ఢిల్లీలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇంటి నుంచి రూ.64.84 లక్షల బ్లాక్ మనీని అధికారులు సీజ్ చేశారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.70 కోట్ల నగదు, 170 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ చీఫ్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు.