: నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే శేఖరరెడ్డి ఇంటికి చేరిన కొత్త కరెన్సీ.. పదిమంది అధికారుల సహకారం!
రూ.కోట్ల కొద్దీ నగదు, కేజీల కొద్దీ బంగారంతో పట్టుబడిన టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖరరెడ్డికి నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే కొత్త కరెన్సీ అందినట్టు సమాచారం. ఈ విషయంలో పదిమంది అధికారులు సహకరించారు. శేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి ఇళ్లపై ఇటీవల దాడులు నిర్వహించిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో రూ.34 కోట్ల విలువైన కొత్త రూ.2 వేలు నోట్లు ఉన్నాయని అధికారికంగా చెబుతుండగా వాటి విలువ రూ.70 కోట్లని అనధికారిక సమాచారం.
శేఖరరెడ్డిపై కేసు నమోదు చేసి ప్రారంభించిన విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. రూ.2 వేల నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా అవి శేఖరరెడ్డి ఇంటికి చేరుకున్నాయని తేలింది. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ఆలస్యాన్ని నివారించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కరెన్సీని నేరుగా విశాఖపట్టణం, హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ ప్రత్యేక శాఖ(స్కేప్)లకు పంపారు. నిజానికి ఈ నోట్లు మొదట ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐకి, అక్కడి నుంచి వివిధ బ్యాంకులకు సరఫరా చేయాల్సి ఉన్నా జాప్యాన్ని నివారించేందుకు నేరుగా స్కేప్‌లకు పంపారు. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు అధికారులు స్కేప్‌లకు చేరిన కొత్త కరెన్సీని నేరుగా శేఖరరెడ్డికి పంపినట్టు అధికారులు భావిస్తున్నారు.