: అగ్ని-v క్షిపణి పరీక్షకు సిద్ధమైన భారత్.. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం.. చైనా వెన్నులో మొదలైన వణుకు
అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న అగ్ని-V ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) పరీక్షకు భారత్ సిద్ధమైంది. ఈ నెలాఖరులో కానీ, జనవరి మొదట్లో కానీ ఈ క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్టు రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్షిపణి పరిధిలోకి ఉత్తర చైనాలోని పలు ప్రాంతాలు వస్తుండడంతో డ్రాగన్ కంట్రీ వెన్నులో వణుకు మొదలైంది. మూడు దశల పరీక్షలో భాగంగా నిర్వహించనున్న చివరి పరీక్ష ఇదేనని, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ఎఫ్‌సీ) యూజర్ ట్రయల్స్‌కు ముందు క్షిపణి శక్తి సామర్థ్యాలను ఈ పరీక్షతో అంచనా వేయనున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.
అగ్ని-V క్షిపణిని ఏప్రిల్ 2012లో తొలిసారి, సెప్టెంబరు 2013లో మరోసారి పరీక్షించారు. జనవరి 2015లో మూడోసారి పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే భారత్ ‘సూపర్ ఎక్స్‌క్లూజివ్ క్లబ్ ఆఫ్ కంట్రీస్’లో చేరుతుంది. ప్రస్తుతం 5000-5500 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర క్షిపణులు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన భారత్ సగర్వంగా చేరబోతోంది. కాగా ఇప్పటి వరకు భారత్ అభివృద్ధి చేసిన అగ్ని-I, అగ్ని-II, అగ్ని-II క్షిపణులు పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించినవే. అగ్ని-IV, అగ్ని-V క్షిపణులను మాత్రం చైనాను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేయడం గమనార్హం.