: కొట్టుకున్నంత పనిచేసిన భారత బాక్సర్ విజేందర్, టాంజానియా బాక్సర్ ఫ్రాన్సిస్.. స్టేజిపైనే మాటల యుద్ధం
ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్, టాంజానియా బాక్సర్ ప్రాన్సిస్ చెకా మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. స్టేజిపైనే ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. డబ్ల్యూబీవో ఆసియా ఫసిఫిక్ టైటిల్ కోసం ఇద్దరు శనివారం తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి పరిచయ కార్యక్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫొటో ఫ్లాష్‌లు మెరుస్తున్నా, చుట్టూ వందలాదిమంది ఉన్నా ఫ్రాన్సిస్ లెక్కచేయకుండా విజేందర్ పైపైకి వచ్చాడు. విజేందర్ ఒలింపిక్ పతకాన్ని తాను లెక్కలోకే తీసుకోనని, తానే ప్రపంచ చాంపియన్‌ను అని బీరాలు పలికాడు. ఈనెల 17 జరగనున్న ఫైనల్ బౌట్‌లో తానేంటో విజేందర్‌కు చూపిస్తానని వేలు చూపించి విజేందర్ పైపైకి వచ్చి పౌరుషంగా అన్నాడు.
‘‘నేను ప్రపంచ చాంపియన్‌ను ఎందుకు అయ్యానో విజేందర్‌కు తెలిసొచ్చేలా చేస్తా. చూస్తుంటే ఇప్పటికే ఆయన భయపడుతున్నట్టు ఉన్నాడు’’ అంటూ రెచ్చగొట్టాడు. దీనికి విజేందర్ కూడా దీటుగా బదులిచ్చాడు. తన సత్తా ఏంటో 17 రాత్రి తెలుస్తుందని సవాల్ విసిరాడు. ‘‘పోటీకి నేను వందశాతం సిద్ధంగా ఉన్నా. నేను సాధన ఎలా చేసిందీ ఫైనల్లో తెలుస్తుంది. నా ప్రత్యర్థి ఎవరనేది నాకు అనవసరం. ఎవరు ఉత్తమ ఆటగాడో ఆ రోజు అందరికీ తెలుస్తుంది’’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఇద్దరూ స్టేజిపై మాటల కత్తులు దూస్తుంటే అందరూ ఫొటోలు తీస్తూ బిజీగా గడపడం గమనార్హం.