: 16 ఏళ్ల కిందటే జయ వీలునామా.. రక్తసంబంధీకురాలి పేరిట రిజిస్ట్రేషన్?.. వీడుతున్న సస్పెన్స్!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల సంగతి ఏంటన్న ప్రశ్నలకు క్రమంగా సమాధానాలు దొరుకుతున్నట్టు కనబడుతోంది. అసలు ఆమె తన ఆస్తులను ఏం చేయదలిచారు? తన వారసురాలిగా ఎవరిని నిర్ణయించారు? అసలు వీలునామా రాశారా? లేదా? అన్న చిక్కుముడులు క్రమంగా వీడుతున్నట్టు కనబడుతోంది.

జయలలిత ఎప్పుడో 16 ఏళ్ల కిందటే తన రక్తసంబంధీకురాలిపై వీలునామా రాసినట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం. అయితే వీలునామా ఎవరి పేరుపై రాశారన్న సంగతి మాత్రం తెలిసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని వారసులకు (లీగల్ హెయిర్) తప్ప ఇతరులకు వెల్లడించడం వీలుకాదని చెబుతున్నారు. తనకు ఉన్న వెసులుబాటుతో ప్రైవేటు అటెండెన్స్ ద్వారా ఈ తంతు పూర్తి చేయించినట్టు విశ్వసనీయ సమాచారం.

అప్పట్లో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్ స్వయంగా జేజే గార్డెన్స్‌కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. జూలై 14, 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశారు. అప్పట్లో జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు. వీలునామా, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్‌లో తన గార్డెన్స్ ఉన్న పేట్ బషీరాబాద్‌ అడ్రస్‌తో చేయించారు.

‘పురుచ్చి తలైవి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్, నమద్ ఎంజీఆర్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్’ల నిర్వాహకురాలిగా జయ తన పేరుతోపాటు శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను రిజిస్ట్రేషన్ సమయంలో చేర్చారు. 2001లో ట్రస్ట్ నిబంధనల్లో చిన్నచిన్న మార్పులు కూడా చేశారు. ట్రస్ట్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు ఐటీ శాఖ అనుమతి తీసుకుంటామని, లేకుంటే కార్యక్రమాలు నిర్వహించబోమని సవరణ పత్రాల్లో పేర్కొన్నారు. ఆస్తుల కేసు విచారణ సందర్భంగా సీబీఐ, న్యాయస్థానాలకు ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News