: గుంటూరు జిల్లా పోలీసు శాఖలో నోట్ల మార్పిడి కలకలం.. నోట్ల మార్పిడిలో పోలీస్ బాస్!


గుంటూరు జిల్లా పోలీసు శాఖలో నోట్ల మార్పిడి వ్యవహారం ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీస్ బాసే ఏకంగా పాతనోట్ల మార్పిడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న వార్త కలకలం రేపుతోంది. తనకు అత్యంత నమ్మకస్తులైన దిగువస్థాయి అధికారులు, కొందరు పోలీసులతో పెద్ద మొత్తంలో పాత నోట్లను బ్యాంకుల్లో మార్పించుకున్నట్టు వెల్లువెత్తుతున్న ఆరోపణలతో పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఖాకీ పవర్ ఉపయోగించి ఆయన నోట్లు మార్చుకుని ‘సేఫ్’ అయినట్టు సమాచారం. ఈ వ్యవహారం కాస్తా డీజీపీ దృష్టికి చేరడంతో విషయం వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది.

బ్యాంకుల్లో కాకుండా బయట మారిస్తే 30 శాతం వరకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుండడంతో ఆ గొడవ ఎందుకని పోలీసు శాఖలోని ‘కొందరు’ తమ ‘పవర్’ ఉపయోగించి నోట్లు మార్పించుకున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న ఓ అధికారి ఏకంగా పది కోట్ల రూపాయల వరకు పెద్ద నోట్లను మార్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు, డెల్టా ప్రాంతంలో దిగువస్థాయి అధికారులతో ఈ తతంగం పూర్తిచేసినట్టు సమాచారం. దీనికి తోడు ఆ అధికారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ‘పని’ మరింత సులభంగా అయిపోయింది. విషయం తెలిసిన అధికార పార్టీలోని వారే కొందరు విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోవడంతో ఐజీ స్థాయి అధికారితో డీజీపీ విచారణ మొదలుపెట్టినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News