: చిగురుటాకులా వణికిన చెన్నై.. కూకటివేళ్లతో కూలిన 9 వేల వృక్షాలు.. పదిమంది దుర్మరణం


‘వార్దా’ తుపాను ధాటికి చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. భారీ వృక్షాలు కూకటివేళ్లతో నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. పలు ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ‘వార్దా’ తుపాను సోమవారం చెన్నైని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రజలతో కన్నీరు పెట్టించింది. నగరంలో విధ్వంసం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చెన్నై రేవు వద్ద తీరాన్ని తాకింది. మూడు గంటలపాటు బీభత్సం సృష్టించింది.

వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన గాలులు నగరాన్ని ఊపేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా చెన్నై, ఎన్నూరు రేవుల్లో ఏకంగా పదో నెంబరు ప్రమాద హెచ్చరికలను ఎగరేశారంటే తుపాను తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తుపాను విధ్వంసానికి వందలకోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించిందని అంచనా. చెన్నై సహా వివిధ ప్రాంతాల్లో తుపాను ధాటికి ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు.

పెనుగాలుల ప్రభావానికి ఒక్క చెన్నైలోనే ఏకంగా 9 వేల భారీ వృక్షాలు నేలకూలాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కనీసం రెండు లక్షల చెట్లు కూలిపోయి ఉంటాయని అంచనా. చెట్లు కూలడంతో వేలాది వాహనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మహాబలిపురంలో రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లు, మరో రెండు బస్సులు గాలికి కొట్టుకుపోయాయి. పునరావాస కేంద్రాల్లో పదివేల మందికి ఆశ్రయం కల్పించారు.

  • Loading...

More Telugu News