: చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పాటు హైఅలర్ట్... సూళ్లూరుపేటలో భారీ వర్షం
వార్దా తుపాను ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై అప్పుడే ప్రభావం చూపుతోంది. తుపాను ఇంకా తీరం దాటకముందే ఈ మూడు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో భారీ వర్షం కురిసింది. వార్దా తుపాను తీరానికి దగ్గరవుతున్నకొద్దీ గాలి వేగంతో పాటు, వర్ష తీవ్రత కూడా పెరుగుతోంది. కలెక్టరేట్ నుంచి మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సూళ్లూరుపేట, నెల్లూరులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
ప్రకాశం జిల్లాలో తుపాను పరిస్థితిని జిల్లా ప్రత్యేక అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. తుపాను షెల్టర్లలో భోజనం, వైద్య సదుపాయాలను కల్పించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చిత్తూరు జిల్లాలో కూడా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. అంతేకాదు, రెండు రోజుల పాటు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు కలెక్టర్. జిల్లాలోని శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లి, సత్యవీడు, చిత్తూరు, కుప్పం, జీడీ నెల్లూరు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించారు. శ్రీకాళహస్తి, మదనపల్లిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప తుపానుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు.