: ‘బిజినెస్ టైకూన్’ అనిపించుకోవాలని లేదు!: నటి శిల్పాశెట్టి
ప్రేక్షకుల, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నటిగానే తాను గుర్తుండిపోవాలి అని ప్రముఖ నటి శిల్పాశెట్టి ఆశిస్తోంది. ప్రస్తుతం యోగ నిపుణురాలిగా రాణిస్తున్న ఆమె, తనను వ్యాపారవేత్తగా పిలిపించుకోవడం కంటే, అందరి హృదయాల్లో నటిగానే తాను గుర్తుండిపోవాలని చెప్పింది. తనకు నచ్చినవి చేస్తున్నానని, వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటే, మరికొన్ని విఫలమయ్యాయని చెప్పింది. అంతేతప్ప, తాను ‘బిజినెస్ టైకూన్’ కావాలని, అలా అనిపించుకోవాలని లేదని చెప్పింది. 2007 లో విడుదలైన ‘అప్నే’ చిత్రం తర్వాత శిల్పాశెట్టి సినిమాల్లో నటించలేదు. తిరిగి సినిమాల్లోకి ఎప్పుడు రీ-ఎంట్రీ ఇస్తారనే విషయమై శిల్పాశెట్టి స్పందిస్తూ ‘ఇప్పటివరకూ, నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పింది. కాగా, ప్రస్తుతం ఓ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న ‘సూపర్ డ్యాన్సర్’ కి న్యాయనిర్ణేతగా శిల్పాశెట్టి వ్యవహరిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ, ఈ ‘షో’లో తాను కేవలం మధ్యవర్తి లాంటిదాన్నేనని, ఈ ‘షో’ లోని డ్యాన్సర్లే నిజమైన ‘స్టార్’ లు అని పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి అభిప్రాయపడింది.