: ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయానికి భూమి కేటాయించిన పాక్ ప్రభుత్వం.. ఆనందంలో హిందువులు
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నివసిస్తున్న వందలాదిమంది హిందువులకు పాక్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చాలా ఏళ్లుగా అక్కడి హిందువులు చేస్తున్న డిమాండ్ నెరవేరే రోజు వచ్చేసింది. హిందూ దేవాలయంతోపాటు కమ్యూనిటీ హాల్, శ్మశాన వాటిక నిర్మాణానికి భూమి కేటాయిస్తూ కేపిటల్ డెవలప్మెంట్ అథారిటీ(సీడీఏ) నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన సీడీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని సెక్టార్ హెచ్-9లో ఇందుకోసం అర ఎకరం భూమి కేటాయించనున్నారు. సీడీఏ నిర్ణయంతో ఇస్లామాబాద్‌లో నివసిస్తున్న 800 మంది హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు హిందూ ఆలయం లేకపోవడంతో పండుగలను ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ హిందువుల కోసం ప్రత్యేకంగా శ్మశానవాటిక కూడా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీడీఏ నిర్ణయంతో ఇక వారి ఇక్కట్లు తీరినట్టే.