: ‘జియో’ వినియోగదారులకు మరో బంపరాఫర్.. వచ్చే ఏడాది మే వరకు ఉచిత ఆఫర్ పొడిగింపు!


సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో మరో బంపరాఫర్‌తో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చీ రావడమే ప్రత్యర్థి టెలికం కంపెనీలకు దడ పుట్టించిన ‘జియో’ తాజాగా తన ఉచిత అపరిమిత కాల్స్ ఆఫర్‌ను మార్చి తర్వాత మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న ఆఫర్‌ను ఇటీవల ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ‘జియో’ దెబ్బకు పోటీ సంస్థలు దిగివచ్చి ఉచిత ఆఫర్లు ప్రకటిస్తుండడంతో వాటిని మరోమారు కోలుకోలేని దెబ్బ తీసేందుకు ముకేశ్ ‘ఉచిత’ సేవలను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. పోటీ కంపెనీల ఆఫర్లవైపు వినియోగదారులు మళ్లిపోకుండా ఉండేందుకే ‘జియో’ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మార్కెట్లో తమ వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేని దిగ్గజ టెలికం సంస్థలు ‘జియో’ నుంచి పోటీని తట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఒకదాని వెనక ఒకటి ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత ఆఫర్‌ను పొడిగించాలన్న నిర్ణయానికి జియో వచ్చినట్టు టెలికం విశ్లేషకుడు రాజీవ్ శర్మ అభిప్రాయపడ్డారు. రెలిగేర్ సంస్థలోని టెలికం విశ్లేషకులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని రిలయన్స్ నిర్ణయించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News