: ఏపీకి దడ పుట్టిస్తున్న ‘వార్దా’.. కోస్తాంధ్రవైపు దూసుకొస్తున్న తుపాను!
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను ఆంధ్రప్రదేశ్‌కు దడ పుట్టిస్తోంది. రోజురోజుకు బలపడుతూ తీవ్రరూపం దాలుస్తోంది. నిన్న తీవ్ర తుపానుగా మారిన వాయుగుండం శనివారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తావైపు దూసుకువస్తోంది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పున 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అతి తీవ్ర తుపానుగా మారిన ‘వార్దా’ అదే తీవ్రతతో పశ్చిమ వాయవ్య దిశగా ఆదివారం సాయంత్రం వరకు పయనించనుంది. దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించి చెన్నై-ఒంగోలు మధ్య రేపు సాయంత్రంలోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ప్రభావంతో కోస్తాలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, చిత్తూరు జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో నేటి అర్ధరాత్రి నుంచి గంటకు 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కోస్తాంధ్ర తీరం వెంబడి 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఏపీలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లోను అధికారులు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.