: ముంచుకొస్తోంది.. తీవ్ర తుపానుగా మారిన ‘వార్ధా’.. అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘వార్ధా’ తుపాను ఈ రోజు తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కావలి-మచిలీపట్నం మధ్య ఎల్లుండి సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. వాతావరణ శాఖ చేసిన వార్ధా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గల్ఫ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా విపత్తు నిర్వహణ, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు. తుపాను, పెద్దనోట్ల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తమకి కావలసిన సరుకులను ముందుగానే తెచ్చిపెట్టుకోవాలని ఆయన చెప్పారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు.