: నగదురహిత లావాదేవీలు జరపడంతోనే సమస్యలు తీరుతాయి!: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజల కష్టాలను తీర్చడానికి గ్రామీణ బ్యాంకులకు నగదు రవాణాను పెంచాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపాలని చెప్పారు. నోట్ల కొరత నేపథ్యంలో ఖర్చులు వాయిదా వేసుకోవడం వల్ల సమస్యలు తొలగిపోవని, నగదురహిత లావాదేవీలు జరపడంతోనే సమస్యలు తీరుతాయని ఆయన చెప్పారు. నోట్ల కొరతను తీర్చడానికి ప్రతిరోజూ రూ.20 వేల కోట్ల నగదును ముద్రిస్తున్నారని, త్వరలోనే రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల విలువ చేసే రూ.500 నోట్లు రానున్నాయని చంద్రబాబు తెలిపారు.