: శేఖర్ రెడ్డి తప్పించిన రూ. 24 కోట్లు... వేలూరు దగ్గర పట్టేసిన ఐటీ... అన్నీ కొత్త రూ. 2 వేల నోట్లే!
వందల కోట్ల అవినీతి ధనంతో ఆదాయపు పన్ను అధికారులకు అడ్డంగా దొరికిపోయి సంచలనం సృష్టించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి చెందిన మరో రూ. 24 కోట్లు పట్టుబడ్డాయి. ఐటీ దాడుల తరువాత, మరో ప్రాంతంలో ఉంచిన ఈ డబ్బును ఎలాగోలా ఆయన బయటకు తరలించగా, విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు, వేలూరు వద్ద కారులో తీసుకు వెళుతున్న ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా అన్నీ కొత్త రూ. 2 వేల నోట్లే కావడంతో అధికారులు సైతం విస్తుపోయారు. ఇప్పటివరకూ శేఖర్ రెడ్డికి సంబంధించిన రూ. 174 కోట్ల కరెన్సీ, 127 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు అప్పగించనున్నట్టు ఐటీ శాఖ పేర్కొంది. కేసు వెనక బంగారం వ్యాపారులు, బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నందున విషయం తమ పరిధి దాటిందని ఐటీ అధికారులు వ్యాఖ్యానించారు. శేఖర్ రెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇంట్లో మూడు రోజులుగా సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.