: పదవిని వీడిన తరువాత తొలిసారి ప్రసంగిస్తూ, నోట్ల రద్దు ఊసెత్తని రఘురాం రాజన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని వీడిన తరువాత రఘురాం రాజన్, తొలిసారిగా ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అహ్మదాబాద్ లో 'ది గ్లోబల్ ఎకానమీ: ఆపర్చ్యునిటీస్ అండ్ చాలెంజస్' అంశంపై మాట్లాడుతున్న వేళ, రాజన్, దేశంలో సంచలనం రేపిన నోట్ల రద్దుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంస్కరణగా, తాను పదవిని వీడిన తరవాత వచ్చిన నోట్ల రద్దుపై ఆయన తన అభిప్రాయాన్ని చెబుతారని పలువురు భావించినా, రాజన్ మాత్రం నోరు మెదపలేదు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ప్రొఫెసర్ గా ఉన్న ఆయన, అహ్మదాబాద్ ఐఐఎంను సందర్శించారు. ఇక భవిష్యత్తులో టెక్నాలజీ పెద్ద పాత్ర పోషించనుందని, 100 శాతం మానవ వనరులను సాంకేతికత రీప్లేస్ చేయనుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పలువురు ఐఐఎం పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.