: అసలు మీ దగ్గరేమైనా ప్లాన్ ఉందా? నోట్ల రద్దుపై మోదీ సర్కారుకు సుప్రీం సూటి ప్రశ్న
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తరువాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, సుప్రీంకోర్టు కాస్తంత గట్టిగానే స్పందించింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అసలు కేంద్రం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించింది. లేక ఆషామాషీగా నోట్ల రద్దును ప్రకటించారా? అని అడిగింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన వేళ, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదన విన్న అనంతరం, "రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన వేళ, మీరనుకున్నంత మేరకు కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టారా? అసలెంత కొత్త కరెన్సీ కావాలని అంచనా వేశారు? మీ వద్ద ఏదైనా ప్లాన్ వుందా? రూ. 10 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వస్తాయని భావిస్తే, అంత మొత్తం కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు ఏఎం ఖాన్ విల్కార్, డీ చంద్రచూడ్ ల ధర్మాసనం కేసును విచారించింది. కాగా, డిసెంబర్ 31లోగా మరో రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ కావచ్చని అంచనా వేస్తున్నట్టు అటార్నీ జనరల్ తెలిపారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తూ, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.