: ఇక్కడ మాత్రం సీన్ రివర్స్... ఏటీఎంలలో ఫుల్ క్యాష్ - జనం మాత్రం నిల్!
ఇండియాలో కరెన్సీ కోసం ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. ఏటీఎంల ఎదుట గంటల కొద్దీ నిలబడినా డబ్బులు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కాశ్మీరాన మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ఇక్కడ ఏటీఎంలలో డబ్బులు ఉన్నప్పటికీ, వాటిని తీసుకునే వారు లేరు. ఏటీఎంల వద్ద నలుగురు లేదా ఐదుగురు మాత్రమే కనిపిస్తుండటం గమనార్హం. శ్రీనగర్ లో కొత్త నోట్లు వచ్చిన తరవాత ఓ రెండు రోజులు మాత్రమే ప్రజలు బారులు తీరినట్టు కనిపించారని, ఆపై సాధారణ పరిస్థితి నెలకొందని సోపోర్ లోని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు మేనేజర్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం, ప్రజలు దేన్నీ కొనకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల కర్ఫ్యూ నేపథ్యంలో తమకు అవసరమయ్యే నిత్యావసరాలను ప్రజలు ముందుగానే నిల్వ చేసుకుని ఉండటం వల్ల వారికిప్పుడు కరెన్సీతో పనిలేకుండా పోయిందని తెలుస్తోంది.