: కాశ్మీరాన బీజేపీతో తేడాలు... తన క్యాబినెట్ భేటీ నుంచి ముఫ్తీ వాకౌట్
జమ్మూ కాశ్మీర్ లో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తినట్టు తీవ్రమైన సంకేతాలు వెలువడుతున్నాయి. తన క్యాబినెట్ భేటీ నుంచి ముఫ్తీ వాకౌట్ చేయడం కలకలం కలిగిస్తోంది. బీజేపీ మంత్రులు చేస్తున్న వాదనలు, వారి డిమాండలతో ఏకీభవించలేక ఆమె సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు. కాశ్మీర్ పోలీస్ సేవల (కేపీఎస్) పునర్వినియోగంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా, బీజేపీ మంత్రుల వాదన, ముఫ్తీకి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. కాగా, ముఫ్తీ వెళ్లిపోయిన తరువాత కూడా ఈ భేటీ కొనసాగడం గమనార్హం. అయితే, ఈ భేటీ తరువాత కొందరు బీజేపీ నేతలు, మంత్రులు ముఫ్తీ నివాసానికి వెళ్లి ఆమెతో ప్రైవేటు చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. కేపీఎస్ ను తిరిగి నిలపాలని ముఫ్తీ భావిస్తుండగా, దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జమ్మూ కాశ్మీర్ లో ముఫ్తీ నేతృత్వంలోని పీపీడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.