: పెద్ద నోట్ల రద్దు ‘కొందరికి’ ముందే తెలుసు.. సెప్టెంబరు 16-30 మధ్య రూ.3.55 లక్షల కోట్ల డిపాజిట్లు!


నల్లకుబేరుల ఆట కట్టించేందుకు, ఉగ్రవాదుల పీచమణచేందుకు, భారత్‌ను కరెన్సీ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి ‘కొందరికి’ ముందే తెలుసనే అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా వెలుగు చూస్తున్న లెక్కలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. పైకి ఎటువంటి అనుమానాలు రాకుండా మొత్తం చక్కబెట్టినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 16 నుంచి 30 మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు ఏకంగా రూ.3.55 లక్షల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. కేవలం 15 రోజుల్లో ఇంత సొమ్ము డిపాజిట్ కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు సరిగ్గా సెప్టెంబరు 16నే ఆర్బీఐ ఓ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి బ్యాంకులు సేకరించిన డిపాజిట్లకు వందశాతం సీఆర్ఆర్ (నగదు నిల్వ నిష్పత్తి) వర్తిస్తుందన్నది దాని సారాంశం. బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాల్సి వస్తుంది. దీనిని సీఆర్ఆర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీకి డిమాండ్ విపరీతంగా ఉంటుందని గ్రహించిన ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. రిజర్వుబ్యాంకు ప్రకటనలోని అంతరంగాన్ని పసిగట్టడం సాధారణ వ్యక్తుల వల్ల కాదు. నోట్లకు సంబంధించి ప్రభుత్వం ఏదో చేస్తోందని అనుమానించిన ‘కొందరు’ అప్పటి నుంచే పావులు కదపడం మొదలుపెట్టారు. ఏకంగా రూ.3.55 లక్షల కోట్ల సొమ్మును వివిధ రూపాల్లో బ్యాంకులకు చేర్చారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన అనుమానాలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కొట్టిపడేస్తున్నారు. ఈ డిపాజిట్ల వెల్లువకు వేతన సవరణ కమిషన్ బకాయిల చెల్లింపులే కారణమని చెబుతున్నారు. ప్రతి విషయాన్ని ఇలా భూతద్దంలో చూడడం తగదని అంటున్నారు.

  • Loading...

More Telugu News