: చెన్నయ్ లో నిర్వహిస్తోన్న తనిఖీల్లో 106.52 కోట్ల నగదు, 127 కిలోల బంగారం స్వాధీనం
టీటీడీ బోర్డు సభ్యుడు, అన్నాడీఎంకే నేత జె.శేఖర్‌రెడ్డి భారీ మొత్తంలో నల్లధనం మార్చుకున్నారని తెలుసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. చెన్నయ్‌లోని ఆయనకు చెందిన పలు భవనాలతో పాటు నలుగురు తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం వీరికి సంబంధించిన 6 ఇళ్లు, 2 ఆఫీసుల్లో సోదాలు నిర్వహించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వారి నుంచి ఇప్పటివరకు రూ. 106.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఆ నగదులో కొత్త 2 వేల రూపాయల నోట్లు రూ.9.63 కోట్ల విలువైనవి ఉండగా, మరో 96.89 కోట్ల రూపాయలు రద్దైన నోట్లు ఉన్నాయని చెప్పింది. అంతేగాక, వారి నుంచి మొత్తం 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వాటి విలువ రూ. 36.29 కోట్లు ఉంటుందని తెలిపింది. సోదాల్లో వారు వెల్లడించిన పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా సీజ్ చేశామని, సోదాలు కొనసాగుతున్నాయని తెలిపింది. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో శేఖర్‌రెడ్డి కొన్నిసార్లు ఆమె వద్దకు పరామర్శకు వెళ్లినట్టు సమాచారం. ఆమె కోసం రాజశేఖర్ అమ్మవారి ప్రసాదం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.