: రాహుల్ చెప్పేది వినడానికి మేం సిద్ధం.. మేం స్పందించినప్పుడు మరి రాహుల్ పారిపోకూడదు: బీజేపీ
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తనను అధికార పక్ష నేతలు మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే మాత్రం భూకపం వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. రాహుల్ వ్యాఖ్యలకు భూకంపం వచ్చేది బయట కాదని, కాంగ్రెస్ పార్టీలోనే వస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. పార్లమెంట్ సమావేశాలను రాహుల్ గాంధీ ఆయనకు ఇష్టమొచ్చిన రీతిలో కొనసాగాలని కోరుకుంటారనీ, కాంగ్రెస్ పార్టీలోలాగే పార్లమెంటులోనూ వ్యవహరించడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి అనుగుణంగానే పార్లమెంటు కొనసాగుతుంది కానీ, రాహుల్‌గాంధీకి అనుగుణంగా కాదని ఆయన చెప్పారు. ఇదే అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. తమ పార్టీ రాహుల్ వ్యాఖ్యలకు భయపడదని చెప్పారు. రాహుల్ ఏం చెప్పాలనుకుంటున్నారో అది వినడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే తాము స్పందించినప్పుడు మాత్రం రాహుల్ గాంధీ దూరంగా పారిపోకూడదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నప్పటి నుంచీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరాజయం పాలవుతోందనే కోపంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ తమ సర్కారు తీసుకున్న నిర్ణయానికి సామాన్య ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు.