: నోట్ల రద్దుతో పేటీయం ఫుల్ జోష్... త్వరలో 20 వేల కొత్త ఉద్యోగాలు
పెద్ద నోట్లు రద్దయిన తర్వాత జనాల చేతుల్లో కరెన్సీ కనబడటమే తక్కువయింది. నో క్యాష్ బోర్డులతో బ్యాంకులు, ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. ఏదైనా కొనాలన్నా, చెల్లింపులు జరపాలన్నా చేతిలో డబ్బు లేకపోవడంతో... జనాలంతా మెల్లగా డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను నిర్వహించే పేటీయం ఒక్కసారిగా దూసుకుపోయింది. ఇప్పటికే పేటీఎంలో 11 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో గత నెలలో చేరిన ఉద్యోగుల సంఖ్య 1500. ఇప్పుడు లావాదేవీలు గణనీయంగా పెరగడంతో, మరో 20 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ప్రతి రోజూ తమ యాప్ ద్వారా రూ. 150 కోట్ల నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నోట్ల రద్దు ప్రకటన ముందు రోజు వరకు ప్రతి రోజు రూ. 40 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగేవని తెలిపారు.