: నగదు కష్టాలను అధిగమించడానికి.. మూడు కాంబినేషన్లతో ముందుకు: చంద్రబాబు
"చేతిలో డబ్బుంటే ఫర్వాలేదు. లేకుంటే డెబిట్ కార్డున్నా ఓకే. ఈ రెండూ లేకుంటే కనీసం మొబైల్ ఫోన్ ఉన్నా కూడా ఇబ్బంది రాదు. ఈ మూడింటిలో ఏది చేతిలో ఉన్నా, నగదు కష్టాలుండవు. ఈ మూడు కాంబినేషన్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే వాడే కంటే, సమయానుకూలంగా ఒక్కో విధానాన్ని వాడితే మేలు కలుగుతుంది" అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నగదు రహిత లావాదేవీలపై ఢిల్లీ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ముంబైలో బ్యాంకర్లతో జరిగిన సమావేశం, చర్చల వివరాలను అధికారులతో పంచుకున్నారు. బ్యాంకర్లతో చర్చలు ఫలవంతమయ్యాయని, నగదు కొరత సమస్యను అధిగమించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీడీఎస్ విధానాన్ని నందన్ నీలేకని అభినందించారని గుర్తు చేసిన చంద్రబాబు, పలు పథకాలను నీతి ఆయోగ్, ఆర్బీఐలు గుర్తు చేసి మెచ్చుకున్నాయని తెలిపారు. బిజినెస్ కరస్పాండెంట్లను భారీగా పెంచుకునేందుకు బ్యాంకు చైర్మన్లు ఒప్పుకున్నారని తెలిపారు.