: ఏయూ అ'పూర్వ' సమ్మేళనం రేపటి నుంచే... 'ఆంధ్ర' వైభోగానికి సర్వం సిద్ధం


అందాల సాగర నగరం విశాఖపట్టణంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్శిటీలో పండుగ వాతావరణం నెలకొంది. వారం పాటు జరిగే అ'పూర్వ' సమ్మేళనానికి విశ్వవిద్యాలయం ముస్తాబైంది. ఈ 'ఆంధ్ర' వైభోగంలో పాలుపంచుకునేందుకు మన దేశంలో ఉన్న పూర్వ విద్యార్థులే కాకుండా, విదేశాలలో స్థిరపడ్డవారు కూడా తరలి వస్తున్నారు. యూనివర్శిటీలో గడిపిన ఆనందకర రోజులను గుర్తుకు తెచ్చుకోవడానికి, కష్ట సుఖాలను పంచుకున్న పాత మిత్రులను కలుసుకోవడానికి పూర్వ విద్యార్థులంతా విశాఖకు విచ్చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుమారు 28 వేల మంది పూర్వ విద్యార్థులకు సంబంధించిన సమాచారం డేటా బేస్ లో నిక్షిప్తమై ఉంది. పూర్వ విద్యార్థుల్లో బీజేపీ ఎంపీ హరిబాబు, డీజీపీ సాంబశివరావు, ఆర్టీసీ ఛైర్మన్ మాలకొండయ్య, బ్యాంక్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ ఛైర్మన్ పూర్ణ సగ్గుర్తి, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ బంగారురాజు లాంటి అతిరథ మ‌హార‌థులు ఉన్నారు. రేపు (డిసెంబర్ 10) ఈ సమ్మేళనం ప్రారంభమై... వారం రోజుల పాటు కొనసాగనుంది. 17వ తేదీన వేడుకలు ముగుస్తాయి. అపూర్వ సమ్మేళనం వేడుకల వివరాలు ఇవి... * రేపు ఉదయం డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి 136వ జయంతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కార్యక్రమాలను ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. * రేపట్నుంచి 16వ తేదీ వరకు విద్యార్థులకు క్విజ్, ఆటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తారు. * 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఏయూ సెనేట్ హాలులో ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహిస్తారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు ఉపన్యాసాలు ఇస్తారు. * 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభమవుతుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ విభాగాల్లోని సహచర విద్యార్థులు, ఆచార్యులు సమావేశమవుతారు. మధ్యాహ్న భోజనాలు కూడా వారివారి విభాగాల్లోనే చేస్తారు. దీనికితోడు, ఆయా విభాగాల వద్ద జరిగే సమ్మేళనంలో విద్యార్థుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు యూనివర్శిటీని వీక్షిస్తారు. వారు చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత యూనివర్శిటీలో జరిగిన అభివృద్ధిని చూస్తారు. క్యాంపస్ లోని అన్ని విభాగాలను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు కాన్వొకేషన్ హాల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు, పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ హరిబాబులతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం వెబ్ సైట్ ను చంద్రబాబు ప్రారంభిస్తారు. దీంతోపాటు పూర్వ విద్యార్థుల మొబైల్ యాప్, సావనీర్ లతో పాటు పూర్వ విద్యార్థుల సంఘంపై రూపొందించిన ఆరు నిమిషాల నిడివి గల వీడియో పాటను ఆవిష్కరిస్తారు. అనంతరం గ్రంధి మల్లికార్జునరావు నిధులతో నిర్మించిన పూర్వ విద్యార్థుల సంఘం కార్యాలయాన్ని, సంఘం సంయుక్త కార్యదర్శి కుమార్ రాజు నిధులతో అభివృద్ధి చేసిన కామర్స్, మేనేజ్ మెంట్ విభాగం సెమినార్ హాలును రిమోట్ ద్వారా చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ప్రముఖుల ప్రసంగాల తర్వాత వారం రోజుల పండుగ ముగుస్తుంది.

  • Loading...

More Telugu News