: జయలలిత స్థానంలో శశికళ వచ్చేశారు... పోస్టర్లలో ఎంజీఆర్ పక్కన దివంగత సీఎం!
జయలలిత కన్నుమూసి ఉండవచ్చు. కానీ, పోయిస్ గార్డెన్ లోని ఆమె నివాసమే ఇప్పటికీ అధికార కేంద్రం. రాష్ట్రంలో పాలన అక్కడి నుంచే సాగుతోంది. ఎటొచ్చీ మార్పేంటంటే, జయలలిత స్థానంలో శశికళ వచ్చి చేరారు. ఆమె మరణించిన ఐదో రోజుకే శశికళ, పార్టీలో టాప్ నేతగా ఎదిగారు. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సైతం ఆమె మాటను ధిక్కరించలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. శశికళను కలిసేందుకు సీనియర్ మంత్రులతో కలసి పన్నీర్ సెల్వం వేద నిలయానికి వచ్చారు. శశికళ పాత్ర ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యమైనదని చెబుతున్నట్టుగా వీరి రాక కనిపించింది. ఇక జయలలిత మరణించిన రోజున శశికళతో అంటీ ముట్టనట్టు వ్యవహరించిన ఓ వర్గం మంత్రులు కొందరు సైతం ఇప్పుడు ఆమె వద్దకు వచ్చి చర్చలు జరిపి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక, అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు, శశికళకు గట్టి పోటీ అని భావించిన కేఏ సెంగొట్టియన్ సైతం వేద నిలయం వద్ద కనిపించడం గమనార్హం. ఇక జయలలిత ఇంటి ముందు కొత్తగా వెలుస్తున్న పోస్టర్లలో శశికళ చిత్రాలు కనిపిస్తున్నాయి. వీటిల్లో జయలలిత చిత్రం చిన్నదిగా మారిపోయి, పైన ఏదో ఓ మూల కనిపించే ఎంజీఆర్ పక్కన చేరిపోయింది. దీంతో జయలలిత స్థానాన్ని శశికళ ఆక్రమించేసుకున్నారని, ఇకపై పార్టీలో ఏ నిర్ణయమైనా, ఆమెదేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.