: డిజిటల్ భారతం: చేతి వృత్తుల వారి కోసం 5 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచిన ప్రభుత్వం
నోట్ల రద్దుతో చేతివృత్తుల వారు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు టెక్స్‌టైల్, చేతి వృత్తుల వారి కోసం ప్రభుత్వం దాదాపు 5 లక్షల బ్యాంకు ఖాతాలను తెరిచింది. వీటిలో మూడోవంతు ఖాతాలను ఈనెల తొలి ఐదు రోజుల్లోనే తెరిచినట్టు ప్రభుత్వం పేర్కొంది. డిజిటలైజేషన్‌లో భాగంగా ఇక నుంచి వారి వేతనాలను ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసే ఉద్దేశంతోనే కొత్త ఖాతాలను తెరవడంతోపాటు పాతవాటిని పునరుద్ధరించినట్టు తెలిపింది. కాగా రుణంపై ముడి సరుకును కొనుగోలు చేసేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయాలని నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. చేతివృత్తుల వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎంఎంటీసీ హస్తకళాఖండాలను కొనుగోలు చేస్తోంది. 2.21 లక్షల బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ 845 క్యాంపులను ఏర్పాటు చేసింది. కాగా జూట్ రంగంలో 2.75 లక్షల ఖాతాలను ప్రభుత్వం పునరుద్ధరించింది.