: ముగిసిన ముఖ్యమంత్రుల కమిటీ భేటీ.. రేపు మరోసారి వీడియో కాన్ఫరెన్స్!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ముంబైలో నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, సమావేశం ఫలవంతమైందని అన్నారు. నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ, బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. డిజిటల్ లావాదేవీల నిర్వహణకు బ్యాంకులు, ఆర్బీఐ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. అందుకు బ్యాంకులు కూడా అంగీకరించాయని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే దేశం నగదు రహిత సమాజం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరి దగ్గర ఉన్నాయని, అంతర్జాలం నలుమూలలకు చేరుకుందని అన్నారు. దీనికి తోడు మన దగ్గర ఆధార్ కార్డు రూపంలో ప్రతిఒక్కరికీ గుర్తింపు కార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విధానంతో బ్యాంకు అకౌంట్ల నిర్వహణ, డిజిటల్ లావాదేవీల నిర్వహణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు. రేపు మరోసారి అధికారులు, సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, మరింత అధ్యయనం చేస్తామని, అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News