: ఏంటీ డ్రామాలు... అసలు నోట్ల రద్దుపై మీ డిజైన్ ఏంటి?: ఉండవల్లి ఫైర్
కేంద్ర ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దుపై బీజేపీ చేసిన అసలు డిజైన్ ఏంటని నిలదీశారు. ఒకసారి నల్లధనం అంటారు, మరోసారి టెర్రరిజం అంటారు, మరోసారి డిజిటలైజేషన్ అంటారు, ఇలా ఎన్ని మాటలు చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ కప్పగంతులు ఎందుకని ఆయన నిలదీశారు. మళ్లీ ప్రజలను పక్కదారి పట్టించేందుకు బంగారం అంటున్నారు, ఇలా పూటకో మాటతో ప్రజలను గందరగోళానికి గురి చేయడమెందుకని ఆయన అడిగారు. ముందు ఎన్నికల అఫిడవిట్లలో తమ వద్ద వున్న బంగారం గురించి పేర్కొన్న ప్రజా ప్రతినిధులకు నోటిసులు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో వివిధ దశల్లో జరిగే ఎన్నికల్లో అఫిడవిట్లు దాఖలు చేస్తారని, వాటిల్లో తమ ఆస్తులు ప్రకటిస్తారని, వాటి ఆధారంగా నోటీసులు జారీ చేసి, పరిమితికి మించి వున్న వారి నుంచి బంగారం స్వాధీనం చేసుకోవాలి. ఆ తరువాత ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారి మీద దృష్టి పెట్టాలి. ఆ తరువాత చివర్లో ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన సూచించారు. ఇలా కాకుండా ప్రజలపైపడి వారి సంపదను అక్రమంగా లాక్కోవద్దని ఆయన కోరారు.