: పోలవరం ఎత్తు తగ్గించాలన్న టీఆర్ఎస్... కుదరదన్న కేంద్ర ప్రభుత్వం... లోక్ సభలో చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ లోక్ సభలో విన్నవించారు. ఈ ప్రాజెక్టును సరైన అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని ఆరోపించారు. గ్రీన్ ట్రైబ్యునల్ నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు. పోలవరం ఎత్తును తగ్గించకపోతే ఆధ్యాత్మిక క్షేత్రం భద్రాచలం మునిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, గోదావరి నది ఇరువైపులా వందలాది గ్రామాల్లో ఉన్న లక్షలాది మంది ఆదివాసీలు పునరావాసం కోల్పోతారని చెప్పారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని... ఎత్తును తగ్గించాలని మాత్రమే కోరుతున్నానని చెప్పారు. అయితే, దీనికి కేంద్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ సమాధానమిస్తూ... పోలవరం నిర్మాణాన్ని ఆపడం కాని, ఎత్తు తగ్గించడం కానీ కుదరదని తేల్చి చెప్పారు.