: తెలంగాణలో నంది అవార్డులు మాయం... ఇక 'సింహ' పురస్కారాలు!


సినీ రంగంలో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ఇకపై 'సింహ' పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 40 విభాగాల్లో పురస్కారాలు ఇచ్చేలా, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు, అధికారుల కమిటీ ఆరు నెలలు చర్చించి తయారు చేసిన నివేదిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కు చేరింది. ఇక ఆయన ఆమోదిస్తే, తదుపరి ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, ఉత్తమ సినీ కళాకారుడికి జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంగా రూ.5 లక్షల పారితోషికంతో పాటు స్వర్ణ సింహం, నటులు కాకుండా ఇతర సినీ ప్రముఖుడిని ఎంపిక చేసి పైడి జయరాజు పేరిట స్వర్ణసింహం, రూ. 5 లక్షల పురస్కారం, తెలుగు సినీ ప్రముఖుడిని ఎంపిక చేసి, రఘుపతి వెంకయ్య పురస్కారం కింద స్వర్ణసింహం, రూ. 5 లక్షల నగదు, తెలంగాణ పరిధిలో సినీ ప్రముఖుడిని ఎంపిక చేసి, కాంతారావు పురస్కారం కింద స్వర్ణసింహం, రూ. 5 లక్షల నగదు ఇవ్వాలని రమణాచారి కమిటీ సిఫార్సు చేసింది. ఆపై ఉత్తమ చిత్రానికి రూ. 5 లక్షలతో పాటు నిర్మాతకు స్వర్ణసింహం, దర్శకుడు, హీరో, హీరోయిన్లకు సింహ పురస్కారాలు, ద్వితీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు రజత సింహం, రూ. 3 లక్షలు, తృతీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు కాంస్య సింహం, రూ. 2 లక్షల నగదుతో పాటు దర్శకుడు, హీరో హీరోయిన్లకు పురస్కారాలు ఇవ్వనున్నారు. వీటితో పాటు ఉత్తమ కుటుంబ చిత్రానికి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పురస్కారం, జాతీయ సమగ్రతను చాటే చిత్రానికి సరోజిని నాయుడు పురస్కారం, తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథం (రూ. 50 వేలు), ఉత్తమ విమర్శకుడు (రూ. 30 వేలు) తదితర విభాగాల్లోనూ అవార్డులు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఉత్తమ దర్శకుడు, హీరో, హీరోయిన్లకు స్వర్ణ సింహం, రూ. లక్ష చొప్పున నగదు, సహాయ నటుడు, నటి, హాస్యనటుడు, విలన్, బాల నటుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, కథారచయిత, మాటలు, పాటల రచయిత, సినిమాటోగ్రాఫర్‌ విభాగాల్లో రూ. 50 వేల చొప్పున, ఉత్తమ సంగీత దర్శకునికి చక్రి పేరిట రూ. 50 వేలతో పాటు సింహ పురస్కారాన్ని అందించాలని సిఫార్సులు వచ్చాయి. వీటితో పాటు ఉత్తమ ఎడిటర్‌, కళా దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, మేకప్‌ ఆర్టిస్టు, స్టంట్‌ డిజైనర్‌, డబ్బింగు కళాకారుడు, కళాకారిణి, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రత్యేక కేటగిరి విభాగాల్లో తామ్ర సింహ పురస్కారం, రూ. 50 వేల నగదు ఇవ్వాలని రమణాచారి కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది.

  • Loading...

More Telugu News