: విశాఖ రైల్వే జోన్ కోసం సురేష్ ప్రభును కలిసిన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కలిశారు. వైజాగ్ రైల్వే జోన్ అంశం ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న అంశమని, విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, దానికి వాల్తేర్ రైల్వే జోన్ గా నామకరణం చేయాలని, వాల్తేరు డివిజన్ ఆదాయం మొత్తాన్ని దీనికి చెందేలా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఒడిశా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న ఈస్ట్ కోస్టు రైల్వేజోన్ కు అత్యధిక ఆదాయం వాల్తేరు డివిజన్ నుంచి సమకూరుతుంది. పోర్టు, షిప్ యార్డు నుంచి రవాణా అయ్యే సరకుల చార్జీలు, ప్రయాణికుల టికెట్ల రూపంలో వచ్చే మొత్తం.. ఇలా ఏ రకమైన ఆదాయం చూసినా ఇందులో వాల్తేరు డివిజన్ దే సింహభాగం. దీంతో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తే ఈ డివిజన్ నుంచి వచ్చే ఆదాయం కోల్పోయే ఈస్ట్ కోస్టు రైల్వే జోన్ ను ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. ఈ నేపథ్యంలో వాల్తేరు డివిజన్ కు ఈస్టు కోస్ట్ రైల్వే జోన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News